కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లిస్తున్నారని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, భారత్ 20, జులై 2026 ALN: తక్షణ విచారణ జరపండి
నిధుల వినియోగంపై ఆడిట్‌కు డిమాండ్
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రికి బండి సంజయ్ లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధుల మళ్లిస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్‌కు లేఖ రాశారు. నిర్దేశిత లక్ష్యాలకు విరుద్దంగా ఆర్ధిక సంఘం నిధులను ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయడం లేదని, కరెంట్ బిల్లులు, డీజిల్ బిల్లులు, శానిటేషన్ సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐలకు నిధులను మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్ల పాత బకాయిలను కూడా ఈ నిధుల నుండే చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.
73వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 243జి అధికరణం, 11వ షెడ్యూల్, అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఇది విరుద్ధం అని ఆయన తెలిపారు. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం రూ.2,293.74 కోట్ల ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేసిందని, మరో రూ.729.41 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పంచాయతీలకు నయాపైసా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఆర్ధిక సంఘం నిధులు కూడా దారి మళ్లించాలని సర్పంచులపైన రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తేవడం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. లిఖితపూర్వక ఉత్తర్వులివ్వకుండా మౌఖిక ఆదేశాలతో సర్పంచులు, కార్యదర్శులపై ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోండి
నిర్దేశిత లక్ష్యాలకే 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్దేశిత అభివృద్ధి పనులకే వినియోగించేలా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని ఆయన కోరారు. దారి మళ్లించిన నిధులను తిరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధి ఖాతాల్లోనే జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.
గ్రామాభివృద్ధి పనులకు వినియోగించకుండా సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, సాధారణ నిర్వహణ ఖర్చులు ఇతర పరిపాలనా అవసరాలకు మళ్లిస్తున్నట్లు గ్రామ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా గ్రామాల్లో చేపట్టాల్సిన తాగునీటి పథకాలు, పారిశుద్ధ్య పనులు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతోందని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల అసలు ఉద్దేశం దెబ్బతింటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
15వ ఆర్థిక సంఘం నిధుల (2020-21 2025-26) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.3,023.15 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉండగా, గ్రామ పంచాయతీ ఎన్నికల ఆలస్యం వల్ల నిధుల విడుదలలో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికలు పూర్తై గత డిసెంబర్‌లో పాలకవర్గాలు ఏర్పడినందున కేంద్ర ప్రభుత్వం రెండు నెలలుగా ఈ నిధులను విడుదల చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ ఫిబ్రవరి 5న రూ.259.36 కోట్లు, ఫిబ్రవరి 12న రూ.387 కోట్లు, 20న రూ.387.53 కోట్లు, మార్చి 13న 640 కోట్లు, మార్చి 31న రూ.619.85 కోట్లు విడుదల చేసిందని, ఇప్పటి వరకు విడతల వారీగా రూ.2,293.74 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. మరో రూ.729.41 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన వివరించారు.
దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను గ్రామ పంచాయతీలకు అందించినట్టే అందిస్తూ.. విద్యుత్తు బకాయిలను చెల్లించడానికి, కరెంట్ బిల్లులు, శానిటేషన్ సిబ్బంది జీతాలు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లు బకాయిలు, డీజిల్ బకాయిల్ చెల్లింపులకు, ట్రాక్టర్ కొనుగోలు ఈఎంఐలకు వినియోగిస్తున్నట్లు ఆయన విమర్శించారు. గ్రామాల్లో అభివ్రుద్ధి ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం నిధులను కూడా విడుదల చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడం వల్ల గ్రామ స్వయం పాలన వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఏర్పడుతోందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కేంద్ర స్థాయి ప్రత్యేక విచారణ లేదా ఆడిట్ నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులను ఇతర అవసరాలకు మళ్లించిన విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని, అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు, సాధారణ పరిపాలనా వ్యయాలు లేదా ఇతర అనుమతించని ఖర్చులకు వినియోగించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు జారీ చేయాలని, గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులు పూర్తిగా నిర్దేశిత అభివృద్ధి పనులకే వినియోగించేలా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని, నిధులు దారి మళ్లించిన అధికారులు, సంబంధిత శాఖల బాధ్యులుగా చేయాలని, అధికారులపై సంబంధిత నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్పంచులపై ఒత్తిడి తెచ్చి నిధులను ఇతర అవసరాలకు వినియోగించే పరిస్థితిని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. ఇప్పటికే దారి మళ్లించిన నిధులను తిరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధి ఖాతాలకు జమ చేసి, ఆయా పనులకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
To learn more about the latest developments in Political Controversies, stay updated with our exclusive reports and analyses on AiLensNews.