కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ, మంత్రి కొండా సురేఖ మరియు జి. చిన్నా రెడ్డిని పదవుల నుంచి తొలగించి, ఆరు నెలల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్, భారతదేశం 26, ఆగ 2026 ALN: కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డిని పదవుల నుంచి తొలగించి, ఆరు నెలల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్‌కు నివేదిక అందజేశారు.
కొండా సురేఖ రాష్ట్ర మంత్రిగా ఉండడం, చిన్నా రెడ్డి రాష్ట్ర మంత్రి హోదా ఉన్న పదవిలో ఉండడం వల్ల నిర్ణయం అధిష్టానం తీసుకోవాల్సి ఉన్నందున, క్రమశిక్షణా కమిటీ నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి పంపించనున్నారు.
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సురేఖ ఖండించకుండా తనకేమీ సంబంధం అన్నట్లు మాట్లాడడాన్ని పార్టీ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నది.
మరోవైపు, జి. చిన్నా రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. పైగా, మంత్రి హోదాలో ఉన్న చిన్నా రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి బిఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పనులు చేసి పెడుతున్నారని ఎమ్మెల్యే మేఘా రెడ్డి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎం పీ మల్లు రవి, వైస్-చైర్మన్ శ్యాం మోహన్ ఇరుపక్షాల వాదనలు విని మంగళవారం పిసిసి అధ్యక్షునికి నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా చైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ, "పార్టీలో క్రమశిక్షణ ప్రధానమైనది" అన్నారు. క్రమశిక్షణపైనే పార్టీ గౌరవం ఆధారపడి ఉంటుందన్నారు.
పార్టీపై గౌరవం ఉంటేనే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. పార్టీపై నెగెటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి నివేదిక అందజేశామని ఆయన తెలిపారు.
పార్టీ అధ్యక్షుడు తమ నివేదికను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు అందజేస్తారని, ఆమె ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు ఇస్తారని ఆయన తెలిపారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ఏ విధమైన చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్టానం పిసిసికి సూచిస్తుందని ఆయన తెలిపారు. పార్టీ అధిష్టానం ఎన్ని రోజుల్లో చర్యలు చేపడుతుందో తనకు ఎలా తెలుస్తుందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
కొండా సురేఖ మరియు చిన్నా రెడ్డిపై పూర్తి అంశాలను నివేదికలో పొందుపరిచామని ఆయన చెప్పారు. గత విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం అని ఆయన తెలిపారు.
గతంలోనూ కొండా ఉల్లంఘనలే..
ఇదిలాఉండగా, మంత్రి పదవి నుంచి కొండా సురేఖను, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నా రెడ్డిని తప్పించాలని క్రమశిక్షణా కమిటీ తమ నివేదికలో సూచించినట్లు సమాచారం. కొండా సురేఖ పార్టీ ఉల్లంఘనలకు పాల్పడడం ఇది కొత్తదేమీ కాదు, గతంలోనూ రెండు సార్లు పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
సినీ నటి సమంత విషయంలో కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో కలకలం చెలరేగింది. దీంతో కొండా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోవడంతో, పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించిన నాయకత్వం ఒక అడుగు ముందుకేసి కొండా తరపున ఆ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
అంతేకాకుండా, మంత్రి కొండా సురేఖ ఒఎస్‌డిగా ఉన్న సుమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు వెళ్ళడంతో, మంత్రి కుమార్తె సుస్మిత తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను వెనక్కి పంపించారు.
క్రమశిక్షణను ఉల్లంఘించిన మాజీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్
ఇదిలాఉండగా, పార్టీ క్రమశిక్షణా కమిటీ మాజీ చైర్మన్ చిన్నారెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పార్టీని బలహీనపరిచేలా ఉన్నాయని క్రమశిక్షణా కమిటీ తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
పార్టీలో అనేక పదవులు అనుభవించి హుందాగా ఉండాల్సిన వ్యక్తి తాను అవసరమైతే మరో జీవన్ రెడ్డిలా మారుతానంటూ చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నది.
ఈ తరుణంలో క్రమశిక్షణా కమిటీ నోటీసు అందుకున్న చిన్నా రెడ్డి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరై తాను ఎవరినీ అవమానించలేదని, కేవలం పార్టీ కార్యకర్తల మనోభావాలనే చెప్పానంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ సమాధానంతో క్రమశిక్షణా కమిటీ సంతృప్తి చెందలేదు. క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసు ఇచ్చినప్పుడు, సంజాయిషీ ఇవ్వకుండా కుమార్తె సుస్మిత ఏదో మాట్లాడితే తనకు నోటీసు ఇవ్వడం ఏమిటీ? అని ప్రశ్నించడంతో పాటు ఆ నోటీసును ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతూ కమిటీకి సమాధానం ఇవ్వడం కూడా పార్టీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది.
మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి క్రమశిక్షణా కమిటీకి అందజేసిన వివరణను కమిటీ తిరస్కరించినట్లు చైర్మన్ మల్లు రవి తెలిపారు.
ఇద్దరినీ సాగనంపండి..
మంత్రి కొండా సురేఖ, చిన్నా రెడ్డిని పదవుల నుంచి తప్పించి ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఆరు నెలల్లో వారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లయితే ఆ తర్వాత వారి సస్పెన్షన్‌ను ఎత్తి వేయవచ్చని కూడా క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇవేమీ పట్టించుకోకుండా..
ఇదిలాఉండగా, మంత్రి కొండా సురేఖ ఇవేమీ పట్టించుకోకుండా సోమవారం అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. మంగళవారం వరంగల్‌కు చేరుకుని వనమహోత్సవంలో పాల్గొనడం గమనార్హం.
To learn more about the latest developments in Political Controversies, stay updated with our exclusive reports and analyses on AILensNews.