తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ALN NEWS DESK
ALN NEWS DESK
Updated : Aug 1, 2026, 06:00 AM IST
6 min read
  • linkedin
  • twitter
  • facebook
  • instagram
  • whatsapp

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు గురించి వివరాలు.

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పెట్టుబడులకు అత్యంత కీలకమని, పెట్టుబడులకు సురక్షితమైన గ మ్యం తెలంగాణ అని, రాష్ట్ర ప్రభుత్వం మీ పెట్టుబడులకు పూర్తి రక్షణగా ఉంటుందని, రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని సిఐఐ నార్తర్న్ రీజనల్ (ఉత్తర భారత ప్రతినిధులతో) కౌన్సిల్ ప్రతినిధులతో సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎంసిఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిఐఐ నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ విజయగాథలాగే, సీఐఐ కూడా 130 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిందని, రాజ్యాంగాన్ని రూపొందించిందని, స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణల వల్లనే భారతదేశం నేడు ప్రపంచ స్థాయికి చేరుకుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌లు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలను కొనసాగిస్తూనే తెలంగాణలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన పివి నరసింహారావు దేశ ప్రధానమంత్రి అయ్యారని, ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులను ఆకర్షించారని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, ఫార్మా, ఐటీ రంగాలు మరింత అభివృద్ధి చెందాయన్నారు. 2014 నుంచి 2023 వరకు బిఆర్‌ఎస్ పాలన కొనసాగిందన్నారు. గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలను కొనసాగిస్తూనే తాము కొత్త విధానాలను అమలు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి విధానాలు తీసుకొస్తే వాటిని కొనసాగిస్తామని సిఎం పేర్కొన్నారు. తాము కూడా మంచి విధానాలను తీసుకొచ్చి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. గత డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించామని, 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ -2047 విధానాన్ని ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10 శాతానికి చేరాలన్నదే తన లక్ష్యమని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉందని, 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడమే తమ ధ్యేయమన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.30 కోట్ల జనాభా నివాసం

తెలంగాణకు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉందని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.30 కోట్ల జనాభా నివసిస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాన్ని సేవా రంగంగా అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, వాతావరణ అంశాలపై సరైన దృష్టి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ముంబైలో భారీ వర్షాల కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కాలుష్యం, మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతల వంటి అంశాలు కొన్ని మెట్రో నగరాలకు సవాళ్లుగా మారాయని సిఎం పేర్కొన్నారు. సరైన విధానాలు ఉంటే పెట్టుబడులను ఆకర్షించడం సులభమని ఆయన తెలిపారు.

ఔటర్ రింగ్‌రోడ్డు తర్వాత 360 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డుగా

ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కోర్‌గా పిలుస్తున్నామని, అక్కడ సేవారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలి ప్రాంతాన్ని ప్యూర్‌గా పిలుస్తున్నామని, ఔటర్ రింగ్‌రోడ్డు తర్వాత 360 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డుగా నిర్మిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అక్కడ తయారీ రంగ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని పరిశ్రమలను ప్యూర్ ప్రాంతానికి తరలిస్తామని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, సౌకర్యాలు కల్పిస్తామని, రేడియల్ రోడ్లు నిర్మిస్తామని, పోర్టుకు అనుసంధానంగా రహదారులు అభివృద్ధి చేస్తామని సిఎం తెలిపారు.

రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని రేర్‌గా పిలుస్తున్నామని అక్కడ వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భూములు అత్యంత సారవంతమైనవని, పూలు, పండ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తామని, కోల్డ్ స్టోరేజీలు, ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నామని ఆయన తెలిపారు. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ సంస్కృతి తమ గొప్ప ఆస్తి అని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు కలిసి జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తున్నామని, వివిధ రకాల పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో తెలంగాణ కీలకంగా మారుతుందన్నారు. తన కల చాలా పెద్దదని ఆయన అన్నారు. మ్యాన్ మాన్‌ఫ్యాక్చరింగ్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని ఈ విషయంలో చైనా, జపాన్, జర్మనీతో పోటీ పడుతున్నామని ఆయన తెలిపారు. పక్క రాష్ట్రాలతో తమకు పోటీ లేదని, టోక్యో, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

2037 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సిఎం ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, కేంద్రం ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణకు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. శంషాబాద్- టు చెన్నై, శంషాబాద్ టు -పుణే, శంషాబాద్- టు బెంగళూరు బుల్లెట్ రైళ్లు రానున్నాయని సిఎం తెలిపారు. న్యూయార్క్‌తో పోటీ పడే వాతావరణం తెలంగాణలో ఉందని, మీరు పెట్టుబడులు పెడితే అడిగిన దానికంటే ఎక్కువ సహకారం అందిస్తామని సిఎం తెలిపారు.

ఎంత పెట్టుబడి పెడతారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పండి

మీకు ఏం కావాలో చెప్పండి మా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. ఎంత పెట్టుబడి పెడతారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పాలని, తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించాలని మిగతాదంతా తాము చూసుకుంటామని సిఎం హామీనిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, పరిశ్రమల శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకు ఒకసారి పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవుతారని, ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను స్వయంగా సమావేశమై సమస్యలను పరిష్కరిస్తానని సిఎం చెప్పారు.

ఉద్యోగాల స్వరూపం మారుతోంది.. ఏఐ సునామీ రాబోతోంది..

నల్సార్, ఐఐటీ, ఐఎస్బీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలు తెలంగాణలో ఉన్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హార్‌వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు కూడా తెలంగాణకు రావాలని కోరుకుంటున్నానని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏఐ వచ్చింది. రాత్రికి రాత్రే పరిస్థితులు మారుతున్నాయని, ఉద్యోగాల స్వరూపం మారుతోందని, ఏఐ సునామీ రాబోతోందని, అందుకే నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

పబ్లిక్, -ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు

పబ్లిక్, -ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా ఉన్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు బోర్డు సభ్యులుగా ఉన్నారని, దేశంలోనే అత్యుత్తమ స్కిల్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో దానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనే పేరు పెట్టామని ఆయన తెలిపారు. వైట్ కాలర్ ఉద్యోగాల నుంచి బ్లూ కాలర్ నైపుణ్యాల వైపు మారాల్సిన అవసరం ఉందని, ఐటీఐలను ఏటిసిలుగా మారుస్తున్నామని, 86 శాతం నిధులను టాటా సంస్థ ఖర్చు చేస్తోందని ఏటిసిల్లో చదువుకున్న వారికి 100 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మొత్తం వ్యవస్థను టాటా నిర్వహిస్తోందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు.

భారత్ ఫ్యూచర్ సిటీ 30 వేల ఎకరాల్లో

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాల్లోనే శిక్షణ ఇస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్కైరూట్ యాజమాన్యం తెలంగాణకు చెందినదేనని, వారికి అవసరమైన మానవ వనరులను స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నామని సిఎం పేర్కొన్నారు. జీసీసీల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చా యని, అమెజాన్ డేటా సెంటర్ల కోసం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోందని సిఎం తెలిపారు. అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.

గుజరాత్ గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లో మాత్రమే ఉందని, భారత్ ఫ్యూచర్ సిటీని 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నామని సిఎం పేర్కొన్నారు. సింగపూర్ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని, ప్రపంచంలోని ప్రముఖ 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావడమే తమ లక్ష్యమని సిఎం ప్రకటించారు. సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, సీఐఐ నార్తరన్ రీజియన్ వైస్‌చైర్మన్ శారదా సూరి మార్వా, ప్రతినిధులు కృష్ణ బోధనపు, గౌరవ్ మహేశ్వరి, వనిత దాట్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వినోద్ కె బాప్న తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలతో జీసీసీలు హైదరాబాద్‌కు క్యూ

సీఐఐ నార్తరన్ రీజియన్, చైర్మన్ పునీత్ కౌరా

తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయని సీఐఐ నార్తరన్ రీజియన్, చైర్మన్ పునీత్ కౌరా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలు, ఇస్తున్న మద్దతుతో జీసీసీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉందని, మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు మెరుగ్గా ఉండడంతోనే సమావేశానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నామని, ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చామని ఆయన తెలిపారు.

Get More Updates

To learn more about the latest developments in Elections, stay updated with our exclusive reports and analyses on AiLensNews.

Related News