ముద్రగడ పద్మనాభం: 'పట్టుదలకు, దీక్షలకు మారుపేరు' అనిపించుకున్న నాయకుడు

ALN NEWS DESK
ALN NEWS DESK
Updated : Jul 15, 2026, 06:37 PM IST
5 min read
  • linkedin
  • twitter
  • facebook
  • instagram
  • whatsapp

ముద్రగడ పద్మనాభం, 73, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ జులై 14న మృతి చెందారు. ఆయన రాజకీయ ప్రస్థానం, నిరసనలు మరియు ఆమరణ దీక్షలతో గుర్తింపు పొందారు.

ముద్రగడ పద్మనాభం...కాపు నేతగానో.. మాజీ మంత్రిగానో... పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాలు చేసి.. పద్మనాభరెడ్డిగా మారిన వ్యక్తిగానే ఇప్పటి తరానికి తెలిసి ఉండొచ్చు. కానీ, ఆయన ప్రస్థానం వేరు.

గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ మంత్రి, ముద్రగడ పద్మనాభం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందారు.

ఆయన వయసు 73 సంవత్సరాలు.

కిర్లంపూడి మునసబు గారి అబ్బాయిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ముద్రగడ పద్మనాభం....నిజాయతీ, రాజీపడని మనస్తత్వం, సేవాగుణం, ఆర్ధికంగా దెబ్బతిన్నా తాను నమ్మిన దారిలో చివరి వరకు నడిచిన మొండిఘటంగా, నిరశన దీక్షలతో పాలకులకు తన డిమాండ్లు వినేలా చేసుకోగలిగిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతుందని ముద్రగడ సన్నిహితుడు ఆకుల రామకృష్ణ బీబీసీతో అన్నారు.

అయితే, ఆయన మొండితనం, పట్టుదలకు పోయేతత్వం ఆయనకు అభిమానులనే కాదు, విమర్శకులనూ పెంచింది.

తొలి దీక్ష దళితులు, బీసీల కోసమే

ముద్రగడ అంటేనే నిరసనలు, ఆమరణ నిరాహార దీక్షలు గుర్తుకువస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో బలమైన కాపు ఉద్యమ నేతగా ఆయన్ను అందరూ చూస్తారు. కానీ అసలు ఆయన ఉద్యమాలు, నిరాహార దీక్షలు మొదలు పెట్టింది దళితులకు, బీసీలకు జరిగిన అన్యాయం గురించే.

1988 డిసెంబర్లో వంగవీటి మోహనరంగా హత్యానంతరం జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసుల్లో... పద్మనాభం అనుచరులైన కొంతమందిని తీసుకెళ్లి ఉత్తర కంచి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో చాలామంది దళితులు, బీసీలు.

ఆ విషయం తెలుసుకున్న పద్మనాభం స్టేషన్‌కు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషన్‌లోకి రానివ్వలేదు. దాంతో ఆయన స్టేషన్‌ ముందే బైఠాయించారు. టెంట్లు వేశారు. 5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం లేదు.

5వ రోజు సాయంత్రం 'ఆమరణ దీక్ష' ప్రకటించారు.

దీంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాదిమంది ముద్రగడ అభిమానులు ఉత్తరకంచి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన యువకులను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆదేశాలతో బేషరతుగా విడుదల చేశారు పోలీసులు.

కాపుల కోసం ఆమరణ దీక్షలు

కాపు విద్యార్ధులకు ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ 1994లో ముద్రగడ దీక్ష చేపట్టారు.

"ఆరు రోజుల నిరశన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాం. పోలీసులు బలవంతంగా తమను లిఫ్ట్‌ చేస్తే ముద్రగడతో పాటు మేము ఏదైనా చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాం. ఈ విషయం అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్‌ రెడ్డికి తెలిసి అరెస్టులు వద్దని పోలీసులను ఆదేశించారు. వెంటనే కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో నం.30 జారీ చేయించారు.

ఆ జీవోపై హైకోర్టు సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చారు. తరువాత డివిజన్‌ బెంచి సమర్థించింది" అని ఆ రోజు దీక్షలో పాల్గొన్న ఆకుల సుబ్బారావు బీబీసీతో అన్నారు.

చంద్రబాబు వచ్చినా తలుపు తీయకుండా...

2014కి ముందు తన కలప మిల్లుకు విద్యుత్‌ బిల్లులు ఎక్కువ వచ్చాయని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే బిల్లులు ఎక్కువ వేశారంటూ ముద్రగడ నిరశన దీక్ష చేపట్టారు.

ఈసారి ఆయన తన ఇంట్లోనే తలుపులు వేసుకుని ఒంటరిగా దీక్షకు దిగారు. ఎవరైనా తలుపులు బద్దలు కొడితే ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధమని హెచ్చరించారు.

అప్పుడు ఆయన ప్రతిపక్ష టీడీపీలో ఉన్నారు.

‘‘విషయం తెలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు వచ్చినా ఆయన తలుపులు తీయలేదు. రెండు గంటల పాటు వేచిచూసిన చంద్రబాబు అక్కడి నుంచి సామర్లకోట వెళ్లిన తర్వాత ముద్రగడ బయటకు వచ్చారు. తర్వాత సామర్ల కోటలో ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ గెస్ట్‌ హౌస్‌లో ఉన్న చంద్రబాబును కలిసి, తన కోసం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు" అని కాకినాడకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు స్వాతి ప్రసాద్‌ గుర్తు చేసుకున్నారు.

పోలవరం నిర్వాసితుల కోసం దీక్ష

2004లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను మొదలు పెట్టింది. ఆ క్రమంలో భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పెంచాలంటూ ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు దిగారని అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య బీబీసీతో చెప్పారు.

"2005 మేలో ఆయన ఇంట్లోనే భార్యతో కలిసి దీక్ష చేపట్టారు. ఆయన చేసిన ఆమరణ దీక్ష అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సూచనలతో నేను ముద్రగడతో మాట్లాడి నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించాం. ఆ తర్వాత ఆయన దీక్ష విరమణ చేశారు. ఇది నాకు బాగా గుర్తు" అని పొన్నాల వ్యాఖ్యానించారు.

ముద్రగడ అంటే కాపు నేతగా చూస్తారు కానీ ఆయన సామాజిక సమస్యలపై కూడా పోరాడారని చెప్పేందుకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని బీబీసీతో పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

ఉద్యమాలకు దూరం

2016 జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ ద్వారా కాపు ఉద్యమాన్ని తీవ్రం చేసే ప్రయత్నం చేశారు ముద్రగడ.

తునిలోని వి.కొత్తూరు వద్ద మైదానంలో సభ మొదలైన తరువాత... 'ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదాం' అంటూ రోడ్లు, రైళ్ల రోకోలు చేయాలంటూ సభకు వచ్చినవారికి పిలుపు ఇచ్చారు ముద్రగడ.

'బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి' అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలమంది హై-వేలు రైల్వే ట్రాకులు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది.

నిరసనకారులు తునిలో ఓ రైలుకు నిప్పంటించారు.ఈ విధ్వంసం వివాదాస్పదమైంది. ఈ వివాదంలో ముద్రగడ పద్మనాభం కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

తుని రైలు దహనం కేసుల్లో అరెస్ట్‌ అయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 2016 ఫిబ్రవరిలో కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ దీక్ష చేపట్టారు.

ఇదే డిమాండ్‌పై 2016 జూన్‌లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రోజుల పాటు నిరాహార దీక్షను కొనసాగించారు.

కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ 2017, 2018లో కూడా ఆయన కిర్లంపూడిలో ఆమరణ దీక్షలకు దిగారు.

ఉద్యమాన్ని మరో రూపంలో తీసుకెళ్దామని అనుచరులు, ఇతర నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన తన దీక్షలను ఎప్పటికప్పుడు విరమిస్తూ వచ్చారు.

యాదృచ్ఛికమే కావొచ్చు కానీ ఆ తర్వాత నుంచి ఆయన ఉద్యమాలకు దూరంగా ఉన్నారు.

కాపు రిజర్వేషన్‌ ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్టు 2020లో ప్రకటించారు.

కుటుంబ జీవితంలో...

ముద్రగడకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.

పెళ్లైన తర్వాత పెద్ద కుమారుడు అనారోగ్యానికి గురికాగా, ముద్రగడ తన కోడలికి కుమారుడితో విడాకులు ఇప్పించి, ఓ ఐఆర్‌ఎస్‌ అధికారికిచ్చి ఆమెకు మళ్లీ వివాహం చేశారని ఆయన సన్నిహితుడు ఆకుల సుబ్బారావు తెలిపారు.

"దాదాపు పదిహేనేళ్ల కిందట ఇది జరిగింది. ఈ విషయం పెద్దగా బయటకు రానివ్వలేదు" అని ఆకుల సుబ్బారావు బీబీసీతో అన్నారు.

ముద్రగడ పద్మనాభం ఎక్సైజ్‌ శాఖ, రవాణా శాఖ, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.

‘‘మంత్రిగాగానీ, ప్రజాప్రతినిధిగాగానీ ఎక్కడా ఆయనపై అవినీతి ఆరోపణలు రాలేదు. అలాంటి నిబద్ధత ఉన్న నేతను అరుదుగా చూస్తాం’’ అని న్యాయవాది గోవిందరావు బీబీసీతో అన్నారు.

1988లో ఉత్తర కంచి ఘటన అనంతరం అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డితో కలిసి 'తెలుగునాడు' పార్టీని స్థాపించారు. అయితే అదే ఏడాది చివరలో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీకి ప్రత్తిపాడులో భారీ సన్మానం ఏర్పాటు చేసిన తర్వాత, తెలుగునాడు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.

1994లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

1995 నుంచి 1999 వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగి, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1999లో ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరి కాకినాడ లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరి అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు.

"తన రాజకీయ జీవితంలో జనతా పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల్లో కొనసాగినా, ఆయన వ్యక్తిత్వంలో ఒక స్వతంత్ర ధోరణి మాత్రం ఎప్పుడూ మారలేదు. పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా, ప్రజా జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆయనను చిరస్థాయిగా నిలబెట్టింది పదవులు కాదు, ఉద్యమం. ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఇవ్వటానికి రాజీనామా లేఖ జేబులో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనే మార్కు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది" అని సీనియర్‌ జర్నలిస్టు స్వాతి ప్రసాద్‌ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

Get More Updates

To learn more about the latest developments in Political History & Legacy, stay updated with our exclusive reports and analyses on AiLensNews.

Related News