నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (54) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలంగాణలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
హైదరాబాద్, భారతదేశం 1, ఆగ 2026 ALN: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. చెదరని చిరునవ్వుతో తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. కడదాకా పోరుజెండా, ప్రజలే ఎజెండాగా బతికారు పెద్ది. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ విద్యుత్తును మండించారు. ప్రజల ఆగ్రహాన్ని మానుకోట రాళ్ల వైపు మళ్లించారు. బలిదానం చేసిన యువకుల భౌతిక కాయాలను గుండెకు హత్తుకొని దవాఖానల చుట్టూ తిరిగిన హృద్యమకారుడాయన. జయశంకర్, బియ్యాల నీడలో ఎదిగి, కేసీఆర్ చేతిలో సుశిక్షిత సైనికుడిలా తయారయ్యారు. ‘పెద్దసారు చెప్తడు. పెద్ది చేసి చూపిస్తడు’ అనే పేరు తెచ్చుకున్నారు. కడదాకా గులాబీ జెండాను పొగరుగా నిలబెట్టారు.
ఎమ్మెల్యేగా పనిచేసింది పట్టుమని ఐదేండ్లే! కానీ ప్రజలకోసం, ప్రాంతం కోసం జీవితమంతా నిష్ఠతో, నిబద్ధతతో పనిచేశారు పెద్ది సుదర్శన్‌రెడ్డి. నిన్నమొన్నటి దాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమానధనుడు. కానీ, ఆపదొస్తే అర్ధరాత్రయినా.. తనను నమ్మినవారి కోసం నిలబడ్డారు. అందుకే, ఆయనిక లేరని తెలిసినప్పుడు.. ఆఖరిచూపు కోసం అవిసిన గుండెలు పరితపించాయి. లక్షలాదిగా జనం తరలివచ్చారు. అంతిమయాత్ర పొడవునా కన్నీటినదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట.. పెద్దకొడుకును కోల్పోయి నట్టుగా రోదించింది. ఇది రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం! ఆయన జీవితం ధన్యం! ప్రజాజీవితానికి పరమార్థం! జోహార్ పెద్దన్నా!!
వరంగల్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (54) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత ఆదివారం హనుమకొండలోని తన స్వగృహంలో తీవ్ర అస్వస్థతకు గురైన పెద్దిని స్థానిక రోహిణీ హాస్పిటల్‌లో ప్రథమ చికిత్స అనంతం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఐదురోజులుగా మృత్యువుతో పోరాడిన పెద్ది మరణవార్తతో తెలంగాణ బోరుమన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ముందుగా పెద్ది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలియగానే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును వరంగల్‌కు పంపి దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించడంతో వారు హుటాహుటిన వరంగల్ వచ్చి ఇక్కడి హాస్పిటల్ వర్గాలతో చర్చించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఆ తర్వాత కేసీఆర్ యశోద హాస్పిటల్‌కు వచ్చి ‘మా పెద్దిని ఎలాగైనా బతికించండి’ అని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. పెద్దికి మెరుగైన వైద్యం అందించి ఆయనను దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్ విశ్వప్రయత్నాలు చేసింది. తమ ఇంటిమనిషి ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా బెంగటిల్లుతారో అంతకన్నా మిన్నగా పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ మొద లు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమస్త పార్టీ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి కోసం బెంగటిల్లారు. అత్యాధునిక వైద్య సదుపాయం లభించినా, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పలుదేశాల వైద్యనిపుణుల సూచనలు, సలహాలతో వైద్యసేవలు అందుబాటులో ఉంచినా పెద్ది సుదర్శన్‌రెడ్డి దక్కకుండాపోయారని బీఆర్‌ఎస్ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పెద్ది రాజకీయ నేపథ్యం
ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలో సామాన్య రైతు కుటుంబంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి 1974, ఆగస్టు 6న రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించారు. ఆరో సంతానంగా జన్మించిన సుదర్శన్‌రెడ్డికి నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెండ్లు. వరంగల్ పట్టణంలో ఇంటర్, డిగ్రీ చదివిన సుదర్శన్‌రెడ్డికి చిన్నతనం నుంచి రాజకీయాలంటే ఇష్టంతో సొంతమండలం నల్లబెల్లిలో యూత్‌క్లబ్ నుంచి తన అధ్యక్ష ప్రస్థానాన్ని ప్రారంభించారు. పెద్ది చురుకుదనాన్ని గమనించిన నాటి కాంగ్రెస్.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో 2001లో పురుడుపోసుకున్న అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరికతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రవాహ సదృశ్యంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌ను లెక్కచేయని మొండితనం కలిగిన యువకుడిగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డిని ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు, ప్రముఖ న్యాయవాది ముద్దసాని సహోదర్‌రెడ్డి ఇద్దరూ వెళ్లి తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ఆహ్వానిస్తే కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేసేందుకు బీ-ఫామ్ ఇచ్చినా కాదని తాను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని పెద్ది ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీ రైతునాగలి గుర్తుపై నల్లబెల్లి జడ్పీటీసీగా విజయం సాధించారు.
నాడు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైంది ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కావడం గమనార్హం. జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా చురుకైన పాత్ర పోషించిన పెద్ది రాజకీయ చురుకుదనాన్ని గమనించిన కేసీఆర్ ఆయనను ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా చేశారు. బీఆర్‌ఎస్‌లో 8 సంవత్సరాల సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు మరొకరులేరు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ది కీలకపాత్ర అయితే వరంగల్ ఉద్యమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పాత్ర అత్యంత కీలకం. అనేక ఉపఎన్నికలు, బీఆర్‌ఎస్ నిర్వహించిన చరిత్రాత్మక బహిరంగ సభలు, మానుకోట, రాయినిగూడెం వంటి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన అనేక ఘటనల సమయంలో జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించింది పెద్ది సుదర్శన్‌రెడ్డి. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి నుంచి రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పెద్దికి కేసీఆర్ అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 2014లో నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. అయితే, ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో పెద్ది ఓటమి పాలయ్యారు. 2018లో మరోసారి కేసీఆర్ కల్పిస్తే ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో పెద్ది ఓటమి పాలయ్యారు. పెద్దిని కేసీఆర్ తన ఉద్యమ సహచరుడిగానే కాకుండా కొడుకులా ఆదరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పెండ్లి చేసుకుంటానని పట్టుబట్టిన పెద్దికి రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమకారిణి స్వప్నతో తిరుపతిలో పెండ్లి చేయించారు. కొద్దికాలానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ది స్వప్నకు జడ్పీటీసీగా పోటీచేసే అవకాశం కల్పించడమే కాకుండా గెలిచాక వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్‌ను చేయడం గమనార్హం.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం శుక్రవారం రాత్రి పోలీ సు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అవసరమై న ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీంతో స్థానిక అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం పొద్దుపోయాక నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పోలీసు లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ కార్యక్రమాలు ముగిసేవరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నీతామై పర్యవేక్షించారు.
నర్సంపేట కన్నీరుమున్నీరు
హనుమకొండ నుంచి నర్సంపేట తీసుకెళ్లే మార్గమధ్యంలో ప్రజలు గుమిగూడి పెద్దికి నివాళులర్పించారు. వరంగల్ వెంకట్రామ థియేటర్ నుంచి దుగ్గొండి మండలంలో గిర్నిబావి నుంచి వందలాది మంది జనం తరలివచ్చారు. అక్కడి నుంచి నర్సంపేట పట్టణ సమీపంలోని అయ్యప్పగుడి నుంచి నర్సంపేట పట్టణంలోకి అడుగుపెట్టేసరికి వేలాది మంది జమయ్యారు. వారిని కంట్రోల్ చేయడం ఎవరి వశం కాలేదు. ఒకదశలో మాజీ మంత్రి హరీశ్‌రావు భావోద్వేగానికి లోనవుతూ విలపిస్తున్నవారిని సముదాయిస్తూ అంతిమయాత్రను ముందుకు నడిపించారు. నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామగ్రామం నుంచి ఎవరికివారుగా పార్టీలకతీతంగా నేతలు, ప్రజలు కదిలివచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
కదిలిన వరంగల్ ఉమ్మడి జిల్లా
పెద్ది అంతిమయాత్ర శుక్రవారం రాత్రివరకు అసాధారణంగా జరిగింది. ఆయనను కడసారి చూసేందుకు వరంగల్ ఉమ్మడి జిల్లా అంతా కదిలివచ్చింది. పెద్ది పార్థివ దేహాన్ని ఉదయం 8 గంటలకు హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్దకు తీసుకొస్తున్నారని తెలిసి పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. హైదరాబాద్ యశోద నుంచి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు రాగా, ఇక్కడ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పార్టీ నేతలు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, ముద్దసాని సహోదర్‌రెడ్డి, కే భరత్‌కుమార్‌రెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, కమరున్నీసాబేగం, యాకూబ్‌రెడ్డి, నీలం రాజ్‌కిశోర్, శరత్ సహా పలువురు విద్యార్థినాయకులు, పార్టీలకు అతీతంగా మార్నేని రవీందర్‌రావు, రావు పద్మారెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, నున్నా అప్పారావు, విద్యార్థినేతలు సాదు రాజేశ్ సహా న్యాయవాదులు, వైద్యులు పెద్ది పార్థివ దేహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు నర్సంపేటకు తరలించారు.
To learn more about the latest developments in Crime & Law, stay updated with our exclusive reports and analyses on AiLensNews.