రైతుల జీవితం మార్పు లేకుండా పోతున్నందుకు ప్రభుత్వ హామీలు, మార్కెట్ సమస్యలు కారణమవుతున్నాయి. రైతులు నష్టపోతున్నారు.
హైదరాబాద్, భారతదేశం 14, జులై 2026 ALN: రైతే రాజు.. మాది రైతు ప్రభుత్వం.. రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం.. ఏ రైతునూ నష్టపోనివ్వం.. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం రైతుల మీద ప్రేమ చూపిస్తూ చెప్పే మాటలు ఇవే. కానీ ఈ మాటలు ఎంతవరకు వాస్తవరూపం దాలుస్తున్నాయో తెలుసుకోవాలంటే రైతులను అడిగితే అవగతమవుతుంది. రైతులపై ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల హామీలు, మాటలు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మెజారిటీ రైతుల స్పందన ఒక్కటే.. నినాదాలు గొప్పగా ఉన్నాయి, కానీ రైతు జీవితంలో మార్పు మాత్రం కనిపించడం లేదనే అసంతృప్తి ప్రతి చోటా కనిపిస్తుంది.
వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు. అది దేశ ఆహార భద్రతకు వెన్నెముక. అయినప్పటికీ, పంటను దుక్కి దున్నడంనుంచి పంటను మార్కెట్‌లో అమ్ముకొని, బ్యాంకులో పడిన నగదును తీసుకునేంతవరకూ అడుగడుగునా రైతు ఎదుర్కొనే కష్టాలకు అంతేలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు, విద్యుత్ సమస్యలు, వర్షాల అనిశ్చితి, ప్రకృతి వైపరీత్యాలు.. ఇవన్నీ దాటుకొని పంట చేతికి వచ్చిన తర్వాత కూడా రైతు గిట్టుబాటు ధరకోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం.
పీపుల్స్ పల్స్ బృందం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని అనేక గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాటలు ఆవేదన కలిగించేవిగా ఉన్నాయి. నెలలో పదిహేను రోజులు కూలీ పనికి వెళితే పది వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ ఏడాది పొడవునా పది ఎకరాలు సాగు చేసినా లక్ష రూపాయలు కూడా మిగలడం లేదు. ఇంటిల్లిపాది శ్రమించినా చివరికి లెక్కలు చూసుకుంటే వ్యవసాయం ఎందుకు చేస్తున్నామో అర్థం కావడం లేదు అని వాపోతున్న రైతుల ఆవేదనకు అంతేలేదు.
ప్రభుత్వాలు ప్రతి పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటిస్తున్నప్పటికీ, అది కాగితాలకే పరిమితం అవుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో వ్యాపారులు తరుగు పేరుతో ప్రతి క్వింటాల్‌కు ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు అదనంగా తీసుకోవడం, నాణ్యత పేరుతో కోత పెట్టడం క్షేత్రస్థాయిలో సాధారణంగా మారిపోయింది. రైతుచేతికి న్యాయంగా రావాల్సిన ఆదాయం ఇక్కడే తగ్గిపోతోంది.
మరో ప్రధాన సమస్య ధరలపై వ్యాపారస్థులు తమ ఇష్టానుసారం ధరలు నిర్ణయించడంతో పంటకోత పూర్తయ్యే సమయానికి మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో రైతుకు గుదిబండగా మారిన అప్పులు తీర్చాల్సిన ఒత్తిడి పెరగడం, కూలీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం, పంట నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన అప్పటి ధరకే అమ్మక తప్పదు.
ఇక్కడ మరో మతలబు కూడా ఉంది. రైతు దగ్గరనుంచి పంట వెళ్లిన కొద్ది రోజుల్లోనే అదే పంట ధరలు గణనీయంగా పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదని, వ్యవస్థ లోపమని రైతులు భావిస్తున్నారు. రైతుల వద్ద పంట కొంటున్న వ్యాపారులు, రైతుల పేరుతో తిరిగి ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో మార్కెటింగ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయి రైతులను నిండా ముంచేస్తున్నారు.
ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం రైతులు పంట అమ్ముకున్న నెల రోజుల్లోనే అనేక పంటలకు 7 నుంచి 30 శాతం ధరలు పెరుగుతున్నాయి. అంటే రైతుకు రావాల్సిన లాభం మధ్యవర్తులు, వ్యాపారులు, నిల్వ సౌకర్యాలున్న వారి చేతుల్లోకి వెళ్తోంది. తరతరాలుగా జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టేందుకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా శాశ్వత పరిష్కారం చూపలేదు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న రైతుల పరిస్థితి దీనికి మంచి ఉదాహరణ. మే నెలలో మొక్కజొన్న పంట కోత సమయంలో క్వింటాల్‌కు రూ. 1600- 1700 మాత్రమే ధర లభించింది. నిల్వ సౌకర్యం లేక రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కేవలం 15- 20 రోజుల్లో వ్యవధిలోనే దాని ధర రూ. 2000కు, మరో పది రోజుల తర్వాత రూ. 2400 వరకు పెరిగింది. అంటే ప్రతి క్వింటాల్‌కు రూ. 300 నుంచి రూ. 700 వరకు రైతు నష్టపోవాల్సి వచ్చింది.
ఎకరానికి దాదాపు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు రైతులకు రావాల్సిన ఆదాయం ఇతరుల చేతుల్లోకి వెళ్లింది. ఇదే పరిస్థితి ధాన్యం, పొగాకు, టమాటా, అరటి, మిర్చి, పత్తి వంటి పంటల విషయంలో తరచూ కనిపిస్తోంది. పొగాకు రైతులు ప్రతి సంవత్సరం ధరల కోసం ఆందోళనలు చేస్తున్నారు. రైతులు ఎక్కువ భాగం తక్కువ ధరకు పంట అమ్మేసిన తర్వాత అధిక ధరకు కొనుగోలు చేయడం ద్వారా మరో ఏడాది కూడా అదే ధర ఉంటుందనే ఆశలతో రైతులు అదే పంట సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
అయితే దళారుల వైఖరీతో పంట అమ్మే సమయానికి నష్టపోతున్నారు. ఇటీవల చిత్తూరులో తోతాపురి మామిడి విషయంలో రైతులను కంపెనీలు ఎలా మోసం చేసింది చూశాం. గత సీజన్లోనూ ఇదే పరిస్థితి తలెత్తినా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఈసారి కూడా దళారులు అలాగే మోసం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అని ప్రకటించడం తరచూ చూస్తుంటాం. కానీ వాస్తవానికి ప్రభుత్వ కొనుగోళ్లు చాలా ప్రాంతాల్లో మొత్తం ఉత్పత్తిలో కొద్ది శాతానికే పరిమితమవుతున్నాయి. ఈలోపు అకాల వర్షాలు వస్తుండటంతో రైతులపై అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. కౌలు రైతులు, చిన్న రైతులు తక్కువ ధరకే పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
విత్తనాలు వేసే సమయంలో అధికారులు మంచి కంపెనీ నుండి కాకుండా ఎక్కువ లంచాలు ఇచ్చే కంపెనీల నుండి విత్తనాలు సేకరిస్తున్నారు. అదే విధంగా విత్తనాల వ్యాపారస్థులు కూడా ఎక్కువ మార్జిన్ ఉంటున్న నాసిరకం విత్తనాలను రైతులకు అంటకడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం కేవలం రైతుబంధు, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి నగదు పథకాలు అందజేయడంతో లభించదు.
అవసరమైన సమయానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట నిల్వసౌకర్యం, తక్కువ వడ్డీకి రుణం, సరైన మద్దతు ధర, మార్కెట్ భరోసా కల్పిస్తే ఎంతో బాగుంటుందని రైతులు చెబుతున్నారు. ప్రతి మండల లేదా క్లస్టర్ స్థాయిలో ఆధునిక గిడ్డంగులు నిర్మించి రైతులు తమ పంటను భద్రపరచుకునే అవకాశం కల్పించాలి.
గిడ్డంగిలో నిల్వ చేసిన పంటను ఆధారంగా చేసుకుని బ్యాంకులు 60- 80 శాతం వరకు తక్కువ వడ్డీతో రుణం అందిస్తే రైతు వెంటనే పంటను అమ్మాల్సిన అవసరం ఉండదు. మెరుగైన ధర ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీంతో రైతు ఆదాయం గణనీయంగా పెరిగి వారికి ప్రయోజనం చేకూరుతుంది.
వరి కోత మిషన్లు. మొక్కజొన్న కోత మిషన్లు మొదలైన వాటిని సీజన్లో ఎక్కువ అందుబాటులో ఉంచకపోవడంతో ఎక్కువ రేట్లు రైతులు చెల్లించాల్సి వస్తుంది. ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు సీజన్ ప్రారంభానికి ముందే రైతులతో సమావేశాలు నిర్వహించి ఆ సంవత్సరపు వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్, సాగు చేయదగిన పంటలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించాలి.
ప్రస్తుతం వాతావరణ శాఖ వర్షాలపై హెచ్చరికలు ఇస్తున్నా వ్యవసాయ అధికారులు రైతులకు వివిరించడంలో తాత్సారం చేస్తున్నారు.
వ్యవసాయం లాభసాటిగా మారాలంటే పంటల ప్రణాళిక, నిల్వ వ్యవస్థ, విలువ ఆధారిత ప్రాసెసింగ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థ, ఈ- మార్కెటింగ్, కోల్ స్టోరేజీలు, గ్రామీణ గిడ్డంగులు, రైతుకు తక్కువ వడ్డీతో నిల్వ రుణాలు వంటి సంస్కరణలు అత్యవసరం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాలి. రైతు సంక్షేమం అంటే కేవలం నగదు పథకాలు కాదు. రైతు శ్రమకు న్యాయమైన విలువ లభించే విధానాలే నిజమైన సంక్షేమం.
రైతు పండించిన పంటకు సరైన ధర వస్తే, మధ్యవర్తుల దోపిడీ తగ్గితే, నిల్వ సౌకర్యం పెరిగితే ప్రభుత్వ సబ్సిడీల అవసరమే చాలా వరకు తగ్గిపోతుంది. దేశానికి అన్నం పెట్టే రైతు తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి వస్తే అది కేవలం రైతు సమస్య కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు కూడా పెను ప్రమాదంగా మారుతుంది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు తాత్కాలిక హామీల బదులు శాశ్వత వ్యవసాయ సంస్కరణలపై దృష్టిపెట్టాలి. లేకపోతే భవిష్యత్తులో నాగలి పట్టి సేద్యం చేసే రైతన్న క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ‘రైతే రాజు’ ఒక కల గా మిగిలిపోతోంది. రైతే రాజు అనేది నినాదానికి మాత్రమే పరిమితమవుతుంది.
గుర్రం మురళీ కృష్ణ
(రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ)
To learn more about the latest developments in Economy, stay updated with our exclusive reports and analyses on AiLensNews.