23 సంవత్సరాల తర్వాత తల్లి తన కొడుకును ఎలా కనుగొన్నారు?

ALN NEWS DESK
ALN NEWS DESK
Updated : Jul 18, 2026, 06:16 PM IST
5 min read
  • linkedin
  • twitter
  • facebook
  • instagram
  • whatsapp

23 సంవత్సరాల తర్వాత తన కొడుకును కనుగొనడం ఎలా జరిగిందో ఈ కథనం ద్వారా తెలుసుకోండి. ప్రకాశం అనే యువకుడు వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందాడు.

(హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు).

"నా పెద్ద కొడుకు ఎప్పుడో చనిపోయాడనుకున్నా. వాడిని తలచుకుని ఏడవని రోజంటూ లేదు. 23 ఏళ్ల తర్వాత వాడు బతికే ఉన్నాడని తెలిసినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. ఇన్నేళ్ల తర్వాత వాడితో ఫోన్లో మాట్లాడినప్పుడు దుఃఖం ఆపుకోలేక పోయాను" అని సుందరి బీబీసీతో చెప్పింది.

కోయంబత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో జులై 13న జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నీలాంబూర్ ప్రాంతానికి చెందిన 68 ఏళ్ల సుందరి 23 ఏళ్ల కిందట తప్పిపోయిన కొడుకును తిరిగి తన వద్దకు చేర్చడానికి జిల్లా యంత్రాంగం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు.

కొడుకు చనిపోయాడనుకున్న తల్లి

విరుదునగర్ జిల్లా తిరుచ్చుళి తాలూకా పూమాలైపట్టి ఆనైకుళం ప్రాంతానికి చెందిన రామమూర్తి, సుందరి దంపతులకు ప్రకాశం, ప్రభు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 30 ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం ఈ కుటుంబం కోయంబత్తూరుకు వలస వచ్చింది.

వీరి పెద్ద కొడుకు ప్రకాశం మూడో తరగతి వరకు కోయంబత్తూరులోని కవుండంపాళయం కార్పొరేషన్ పాఠశాలలో, సాయిబాబా కాలనీలోని ఒక ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నాలుగో తరగతి చదివారు. ఆ తర్వాత అతను బడికి వెళ్లలేదు. 2003లో 16 ఏళ్ల వయసులో కోపంతో ఇల్లు వదిలి వెళ్లిన ప్రకాశం మళ్లీ తిరిగి రాలేదు.

"వాడికి చదువు అబ్బలేదు. ఇంట్లోనే ఉండేవాడు. ఇద్దరు కొడుకుల మధ్య తేడా ఏడాదే. అందుకని చాలా విషయాల్లో వారి మధ్య గొడవలు జరిగేవి. అప్పట్లో ఇంటి అవసరాల కోసం ఒక ద్విచక్రవాహనం కొన్నాం. దాన్ని ఎవరు నడపాలనే విషయంలో గొడవ జరిగింది. చిన్నవాడు అది తన బండి అనడంతో, పెద్దవాడు గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడ వెతికినా కనిపించలేదు" అని సుందరి బీబీసీతో చెప్పారు.

"పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు నెలల తర్వాత మా ఇంటి పక్కనున్న కిరాణా షాపు ఫోన్‌కు కాల్ చేశాడు. తాను చెన్నైలో ఉన్నట్లు దుకాణదారునికి చెప్పి ఫోన్ పెట్టేశాడు. మాతో మాట్లాడలేదు. అప్పుడు వాడికి 16 ఏళ్లు. లోకజ్ఞానం తెలిసిన వయసే కాబట్టి తనే వచ్చేస్తాడని అనుకున్నాం, కానీ రాలేదు. ఎక్కడున్నాడో కూడా సమాచారం తెలియలేదు. వాడిని కనిపెట్టడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు" అన్నారు.

కొన్నేళ్ల తర్వాత వీరు కోయంబత్తూరులోనే కవుండంపాళయం నుంచి నీలాంబూర్ అనే ప్రాంతానికి మారారు. ప్రకాశం తండ్రి రామమూర్తి 2021లో క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు.

ఆ తర్వాత సుందరి, ఆచ్చాంకుళం అనే గ్రామంలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని కూరగాయల సాగు చేస్తూ కొన్ని ఆవులను కూడా పెంచుతున్నారు. ఆమెతో పాటు చిన్న కొడుకు ప్రభు ఉంటున్నారు.

"రోడ్డుపై ఎవరైనా పడుకుని ఉంటే, అది నా కొడుకేమోనని దగ్గరికెళ్లి చూసేదాన్ని. ఏ ఊరికి వెళ్లినా ఎక్కడో ఒకచోట వాడు కనిపించకపోతాడా అని నా కళ్లు వెతికేవి. గత నెల మమ్మల్ని కలవడానికి ముత్తయ్య అనే జర్నలిస్ట్ వచ్చారు. పంజాబ్‌లోని ఒక ఆశ్రమంలో ప్రకాశం ఉన్నారని, వెట్టిచాకిరీ నుంచి ఆయన్ను రక్షించి అక్కడ ఉంచారని ఆయన చెప్పారు. నేను అస్సలు నమ్మలేకపోయాను. ఆయన నా కొడుకు ఫోటో చూపించిన తర్వాతే నాకు నమ్మకం కుదిరింది" అని సుందరి అన్నారు.

కుటుంబం కోసం మూడేళ్ల వెతుకులాట

ప్రకాశం గురించి 2023లో సుభాష్ చెప్పిన కొన్ని వివరాల ఆధారంగా ముత్తయ్య కవుండంపాళయం ఎరుక్కంపెనీ ప్రాంతానికి వెళ్లారు. కానీ, అక్కడ ఈ కుటుంబానికి సంబంధించిన సమాచారం ఏదీ ఆయనకు దొరకలేదు.

"మొదట్లో ప్రకాశం తన వివరాలను సరిగ్గా చెప్పలేదు. సుభాష్ అతనిని పలుమార్లు కలిసిన తర్వాతే కొంచెం స్పష్టంగా మాట్లాడారు. అప్పుడే తన సొంత ఊరు అరుప్పుకోట్టై సమీపంలోని పూమాలైపట్టి ఆనైకుళం అని చెప్పారు. ఆ తర్వాత మూడేళ్లు అరుప్పుకోట్టై, నరిక్కుడి ప్రాంతాల్లోని చాలామందితో మాట్లాడి సమాచారం సేకరించాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత, గత నెలలోనే పూమాలైపట్టిలో షాపు నడుపుతున్న వాసుకి ఫోన్ నంబర్ దొరికింది" అన్నారు.

సుందరి సోదరి కూతురైన వాసుకిని ముత్తయ్య సంప్రదించినప్పుడు, తన పినతల్లి, ఆమె కొడుకు నీలాంబూర్ ఆచ్చాంకుళంలో ఉన్నట్లు చెప్పారు. దీంతో ముత్తయ్య వెంటనే సుందరి ఇంటికి వెళ్లారు. ఆచ్చాంకుళం ప్రాంతంలో ఆవులను మేపుతున్న సుందరి వద్దకు నేరుగా వెళ్లి, ప్రకాశం ఫోటోను చూపించి పంజాబ్‌లోని ఆశ్రమంలో ఆయన ఉన్న విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగానే ప్రకాశం తప్పిపోయి 23 ఏళ్లు అయిందనే విషయమే తనకు తెలిసిందని ముత్తయ్య చెబుతున్నారు.

తన పెద్ద కొడుకు బతికే ఉన్నారని తెలిసిన ఆ క్షణాన్ని సుందరి బీబీసీకి వివరిస్తూ "నా పెద్ద కొడుకును తలచుకుని ఏడవని రోజంటూ లేదు. కరోనాకు ముందు నా భర్త చనిపోయారు. కరోనా సమయంలో కూడా చాలా మంది చనిపోవడంతో నా కొడుకు కూడా చనిపోయే ఉంటాడనుకున్నా. కానీ, వాడు బతికే ఉన్నాడని తెలిసినప్పుడు నాకు కలిగిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. వాడితో మాట్లాడినప్పుడు గుండె పగిలిపోయినంత పనైంది" అన్నారు.

ఆ తర్వాత, జులై ఒకటో తేదీన ముత్తయ్య, ప్రకాశ్ తమ్ముడు ప్రభు ఇద్దరూ కలిసి, హిందీ భాష తెలిసిన, తమ పొరుగున ఉండే లారీ డ్రైవర్ సుందరలింగాన్ని వెంటబెట్టుకుని రైలులో చండీగఢ్ వెళ్లారు. అక్కడ నుంచి పటియాలా జిల్లాలోని లచ్కానీ ప్రాంతంలో ఉన్న అప్నా ఫర్స్ సేవా సొసైటీ ఆశ్రమానికి చేరుకున్నారు. 2022లో వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందినప్పటి నుంచి ప్రకాశం అక్కడే ఉంటున్నారు.

'ఇనుప మంచం, దుప్పటే ఆస్తి'

ప్రకాశం వెట్టిచాకిరీ నుంచి ఎలా విముక్తి పొందారనే విషయంపై బీబీసీ పంజాబీ క్షేత్రస్థాయిలో విచారించింది. 2022లో పటియాలాకు చెందిన 'అప్నా ఫర్స్ సేవా సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ, పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా అజ్నాలా పరిధిలోని ఒక గ్రామం నుంచి ప్రకాశాన్ని రక్షించింది. ఆ ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంది.

సుమారు 15 నుంచి 20 ఏళ్ల పాటు ప్రకాశం వెట్టిచాకిరీలోనే బందీగా ఉన్నారని, ఎన్నో ఏళ్ల బాధ, నిస్సహాయతతో కూడిన జీవితాన్ని గడిపారని ఆ సంస్థ ప్రతినిధులు బీబీసీ పంజాబీకి వివరించారు. వారి సమాచారం ప్రకారం, ప్రకాశానికి ఎలాంటి జీతం ఇవ్వకుండా పని చేయించడమే కాకుండా, గొలుసులతో బంధించి ఉంచేవారు. ఈ చిత్రాలను బీబీసీతో సుభాష్ చందర్ పంచుకున్నారు.

డైరీ ఫామ్ ఉన్న ఒక రైతు ఇంట్లో ఆయన పనిచేశారు. పశువులకు సంబంధించిన పనులన్నీ ఆయనకే అప్పగించేవారు.

"ఆయన పడుకోవడానికి ఒక ఇనుప మంచం, దుప్పటి మాత్రమే ఇచ్చారు. మంచంపై పరుపు గానీ, బెడ్‌షీట్ గానీ ఏవీ లేవు. ప్రతి రాత్రి ఆయన ఉన్న గదిని బయట నుంచి తాళం వేసేవారు. 15 ఏళ్లకు పైగా జీతం లేకుండా శ్రమించిన ఆయనకు సరైన ఆహారం కానీ, తగిన బట్టలు కానీ ఇవ్వలేదు" అని ఎన్జీఓ ప్రతినిధులు బీబీసీ పంజాబీకి తెలిపారు.

మూడేళ్ల కిందట ఈ సంస్థ ప్రతినిధులు ప్రకాశాన్ని రక్షించి, ఆశ్రమానికి తీసుకువచ్చిన తర్వాత, చాలా నెలల పాటు ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆయనతో మాట్లాడించడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఆ తర్వాతే ఆయన కొన్ని మాటలు మాట్లాడటం ప్రారంభించారు.

మొదట ఆయన పేరు అడిగినప్పుడు 'ప్రకాశం' అని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే 'తమిళనాడు' అని సమాధానమిచ్చారు. కానీ, ఆయన ఊరి గురించి అడిగినప్పుడల్లా 'ముంబయి' అనేవారు. ఇందువల్లే ఆయన కుటుంబ సభ్యులను కనిపెట్టడంలో ఇబ్బంది ఎదురైందని ఆ సంస్థ నిర్వాహకులు వివరించారు. ఆ తర్వాత, సుభాష్ చందర్, ముత్తయ్య సహాయంతో ఆయన కుటుంబాన్ని గుర్తించగలిగారు. వీడియో కాల్ మాట్లాడినప్పుడు, ఆయన తల్లి ఆయన్ను వెంటనే గుర్తుపట్టారని కూడా ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.

జులై మొదటి వారంలో ముత్తయ్య, ప్రకాశం తమ్ముడు ప్రభు, సుందరలింగం ఈ ఆశ్రమానికి వెళ్లినప్పుడు, ప్రకాశాన్ని వారితో పంపించాల్సిందిగా సుభాష్ చందర్ ఆ సంస్థ నిర్వాహకులతో వాదించారు. కానీ, వారు పంపడానికి నిరాకరించారు.

దీని గురించి బీబీసీ పంజాబీతో మాట్లాడిన ఆ సంస్థ నిర్వాహకులు, "కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు, మేం వారి నుంచి అదనపు పత్రాలను అడిగి తీసుకున్నాం, అలాగే స్థానిక ప్రభుత్వ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలను కూడా పొందాం. ఏ చిన్న పొరపాటు వల్ల కూడా ప్రకాశం మళ్లీ రక్షణ లేని వాతావరణంలోకి వెళ్లకూడదని నిర్ధరించుకోవాలనుకున్నాం" అని చెప్పారు.

Get More Updates

To learn more about the latest developments in Local & Regional, stay updated with our exclusive reports and analyses on AiLensNews.

Related News