భోగాపురం విమానాశ్రయం ప్రారంభం: విశాఖ విమానాశ్రయానికి భవిష్యత్తు ఏమిటి?

ALN NEWS DESK
ALN NEWS DESK
Updated : Aug 1, 2026, 06:48 AM IST
5 min read
  • linkedin
  • twitter
  • facebook
  • instagram
  • whatsapp

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభమవుతోంది. ఈ విమానాశ్రయం విశాఖపట్నానికి సమీపంలో ఉన్న విశాఖ విమానాశ్రయానికి భవిష్యత్తులో ఏమి చేస్తుంది?

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేడు (ఆగస్టు 1న) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

దాదాపు రెండు దశాబ్దాల కిందట ప్రతిపాదనగా మొదలైన ఈ ప్రాజెక్టు.. ప్రభుత్వాల మార్పు, భూసేకరణ, కోర్టు వివాదాలు దాటి ఇప్పుడు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.

ఆధునిక నిర్మాణశైలితో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన టెర్మినల్‌, వేగవంతమైన ప్రయాణికుల సేవలు, భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా నిర్మించిన మౌలిక వసతులు ఈ విమానాశ్రయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని కేంద్ర విమానయానశాఖ చెబుతోంది.

ఇంతకీ ఈ విమానాశ్రయం ప్రయాణం ఎలా మొదలైంది? ఎలాంటి మలుపులు తిరిగింది? ఇందులోని ప్రత్యేకతలు ఏమిటి?

ఇద్దరు సీఎంలు, రెండుసార్లు శంకుస్థాపన

విశాఖ విమానాశ్రయం విస్తరణకు నేవీ పరిమితులు ఉండటంతో, కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అవసరమనే ప్రతిపాదన రెండు దశాబ్దాల కిందటే తెరపైకి వచ్చింది.

రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు మరింత వేగం అందుకుంది. అందులో భాగంగా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం తీర్మానించింది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 2015 మే 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ఆమోదం తెలిపింది. 2016 అక్టోబర్ 7న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (BIACL) ను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత మొదలైన భూసేకరణలో జాప్యం, పరిహార వివాదాలు, ప్రభుత్వాల మార్పులతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది.

2019 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత, 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్ జగన్ మరోసారి భూమి పూజ చేశారు.

ప్రాజెక్టుకు రెండు వేర్వేరు ప్రభుత్వాల హయాంలో రెండుసార్లు శంకుస్థాపనలు జరిగాయి.

“ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా 2024లో బాధ్యతలు తీసుకోవడంతో ప్రాజెక్ట్ వేగం పెరగిందని” తెలుగుదేశం పార్టీ చెబుతోంది. అయితే, తమ హయాంలోనే పనులన్నీ పూర్తి చేశామని వైసీపీ అంటోంది.

“ఏ ప్రాజెక్టు ప్రారంభించినా అది పూర్తి చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఒక ప్రభుత్వం మొదలుపెడితే మరో ప్రభుత్వం ఆ పనులను కొనసాగిస్తుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో క్రెడిట్ పార్టీలకు కాదు, ప్రభుత్వాలకే చెందుతుంది” అని బీబీసీతో రాజకీయ విశ్లేషకులు ఎం.యుగంధర్ రెడ్డి చెప్పారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలు

ట్రయల్ రన్ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఇందన ప్రభాకరరావు బీబీసీతో మాట్లాడారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 2024 నవంబరులో ఈ విమానాశ్రయానికి 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'గా పేరు పెట్టారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూప్ (GVIAL) అభివృద్ధి చేసింది.

తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.4,700 కోట్లకు పైగా వ్యయం కాగా, దాదాపు 31 నెలల్లో నిర్మాణం పూర్తయింది.

మొత్తం 2,700 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇందులో 2,203 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించగా, మరో 500 ఎకరాలను భవిష్యత్ విస్తరణ కోసం కేటాయించారు.

విమానాశ్రయంలో 22 ఏరోబ్రిడ్జిలు ఏర్పాటు చేశారు.

తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యకు అనువుగా నిర్మించగా, రెండో దశలో దీన్ని 1.2 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి విస్తరించే ప్రణాళిక ఉంది.

బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్‌బస్ A350 వంటి భారీ వైడ్‌బాడీ విమానాల రాకపోకలకు అనువుగా 3.8 కిలోమీటర్ల పొడవున్న రన్‌వేను రూపొందించినట్లు ప్రభాకరరావు తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు విశాఖపట్నం నుంచి 55 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కిలోమీటర్లు, శ్రీకాకుళానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.

టెర్మినల్ ప్రత్యేకతలు

ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని చాటిచెప్పేలా బొబ్బిలి వీణ, కూచిపూడి, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ కళాఖండాలతో టెర్మినల్ ను తీర్చిదిద్దినట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం...

టెర్మినల్‌లో 40 చెక్-ఇన్ కౌంటర్లు, 12 డిజీయాత్రా ప్రవేశ గేట్లు, ఆధునిక బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌, ఫుడ్ కోర్ట్‌, రిటైల్ షాపులు, వీఐపీ లాంజ్‌, కరెన్సీ ఎక్స్ఛేంజ్‌, డిజిటల్ ఫ్లైట్ డిస్ప్లేలు, ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఉన్నాయి.

ఐదు వేల చదరపు మీటర్ల కార్గో టెర్మినల్ ద్వారా ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే సామర్థ్యాన్ని కల్పించారు.

అంతర్జాతీయ విమానాల రాకపోకలకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దీనిని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టుగా ప్రకటించగా, డీజీసీఏ నుంచి ఎయిరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది.

సహజ కాంతి వినియోగం, విద్యుత్ పొదుపు వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం వంటి పర్యావరణహిత సదుపాయాలతో విమానాశ్రయాన్ని నిర్మించారు.

వికలాంగుల కోసం వీల్‌చైర్ సేవలు, ర్యాంపులు, లిఫ్టులు, ప్రత్యేక వాష్‌రూమ్‌లు, ప్రత్యేక పార్కింగ్‌తో పూర్తిస్థాయి బారియర్-ఫ్రీ టెర్మినల్‌ను అందుబాటులో ఉంచారు.

అయితే, ఈ ప్రాజెక్టు వివాదాలకు కూడా కేంద్రంగా నిలిచింది.

భూసేకరణలో రైతులకు తగిన పరిహారం అందలేదని, మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని సీపీఎం సహా పలు రైతు సంఘాలు గతంలో నిరసనకు దిగాయి.

ప్రభుత్వం మాత్రం చట్టబద్ధంగానే భూసేకరణ జరిగిందని, పునరావాసం, పరిహారం కల్పించామని తెలిపింది.

అనుసంధానమే అసలు సవాల్

ఇప్పటి వరకు విశాఖ విమానాశ్రయం నగరానికి సమీపంలో ఉండటంతో చాలా ప్రాంతాల నుంచి 7-8 కిలోమీటర్ల ప్రయాణంతోనే చేరుకునే వీలుండేది. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖ నగరం నుంచి 50-55 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ను బట్టి గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది.

"విమానాశ్రయానికి అనుసంధానంగా ప్రతిపాదించిన 12 ప్రధాన రహదారుల అభివృద్ధిపై ఇంకా స్పష్టత లేదు. తగిన కనెక్టివిటీ లేకపోతే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొంతమందికి విమాన టికెట్ కంటే విమానాశ్రయానికి రాకపోకలకు అయ్యే ఖర్చే ఎక్కువయ్యే పరిస్థితి రావచ్చు" అని విశాఖ ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓ.నరేష్ కుమార్ బీబీసీతో అన్నారు.

ఈ అంశంపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడారు.

"విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకునేలా బీచ్ కారిడార్‌తో నగరం, శివారు ప్రాంతాల అనుసంధాన రహదారులను అభివృద్ధి చేశాం. జాతీయ రహదారులతో కనెక్టివిటీ కల్పించడంతో పాటు ప్రయాణికుల కోసం ప్రత్యేక ఈ-బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం" అని ఆయన బీబీసీకి తెలిపారు.

ఉత్తరాంధ్రకు ప్రయోజనమేంటి?

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు గణనీయమైన ప్రయోజనాలున్నాయని ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓ.నరేష్ కుమార్ అంటున్నారు.

"పర్యాటక రంగానికి పెద్ద ఊతంతో పాటు ఐటీ, డేటా సెంటర్లు, పరిశ్రమల రంగాలకు పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ విమానాశ్రయం కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశం. హోటళ్లు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, ఏవియేషన్ సేవల అభివృద్ధితో ఉత్తరాంధ్ర జాతీయ, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మారే అవకాశం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎయిర్ పోర్టు చుట్టూ ఏరోసిటీ, ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపెయిర్ అండ్ ఓవర్‌హాల్) కేంద్రాలు, లాజిస్టిక్స్ పార్కులు, ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్లు, కన్వెన్షన్ సెంటర్లు, వాణిజ్య సముదాయాల అభివృద్ధి జరుగుతుందన్నారు.

విశాఖ విమానాశ్రయం ఏం కానుంది?

విశాఖ విమానాశ్రయం నేవీ ఆధీనంలో ఉండటంతో భవిష్యత్ విస్తరణ సాధ్యం కాదని, అందుకే భోగాపురంలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభిస్తున్నప్పటికీ, అక్కడి నుంచి సాధారణ విమాన సర్వీసులు ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి.

అప్పటి వరకు విశాఖ విమానాశ్రయం నుంచే ప్రయాణికుల విమానాల రాకపోకలు కొనసాగుతాయి.

ఆగస్టు 17 నుంచి విశాఖ విమానాశ్రయాన్ని ప్రధానంగా రక్షణ శాఖ విమానాలు, అత్యవసర సేవలు, ప్రత్యేక విమానాల నిర్వహణకే వినియోగించనున్నారు.

విశాఖ విమానాశ్రయాన్ని కూడా కొనసాగిస్తే మంచిందని, ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో కొత్త ఎయిర్ పోర్టులు వచ్చినా పాత ఎయిర్ పోర్టులను కొనసాగిస్తున్నారని నరేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

Get More Updates

To learn more about the latest developments in Transport & Mobility, stay updated with our exclusive reports and analyses on AiLensNews.

Related News